నేటికీ పేదలు ఒక్క ముద్ద తింటున్నారంటే అది వైఎస్ఆర్ చలువే..

1881
SHARE

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లయ్యాయి. ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకొని అనేక రాష్ట్రాల్లో మ‌హానేత ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. నాడు ఎన్నో కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసిన వైఎస్ఆర్ అనాథలను ఆదుకునేందుకు ఆయ‌న చేసిన ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. అనాథ పిల్లలకు కూడా ఎస్సీ విద్యార్థుల తరహాలో అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు 2008లోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎస్సీ విద్యార్థుల మాదిరే అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయాలు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్‌ 34 జారీ చేసింది. దానికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్‌ గురువారం అసెంబ్లీలో చేసిన ప్రకటన అనాథ పిల్లలకు మరింత బాసటగా నిలవనుంది. ‘‘రాష్ట్రంలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులు. వారిని ఎస్సీలుగా పరిగణిస్తాం. ఎస్సీల రిజర్వేషన్‌ కోటా తగ్గించకుండానే అనాథలకు అదనపు కోటా ఇస్తాం..’’ అని ప్రకటించడం ద్వారా కేసీఆర్‌ అనాథలకు తీపి కబురు వినిపించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలకు కూడా ‘ఆసరా’పథకం కింద ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం శాసనసభలో విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆదరణకు నోచుకోని జోగినులు, విడాకులు పొందిన వారు, పెళ్లికాని మహిళలు.. ఒంటరి స్త్రీల కేటగిరీలోకి వస్తారు. ఇటువంటి వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని ఎంతో కాలంగా డిమాండ్‌ ఉన్నందున, గత కొన్ని నెలలుగా కసరత్తు చేసిన అనంతరం ప్రభుత్వం సాను కూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి ఇప్పటికే సేకరించిన సమాచారం మేరకు ఒంటరి స్త్రీలు సుమారు 4లక్షల మంది వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. వీరందరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందిస్తే, ప్రస్తుతం ఆసరా పథకానికి వెచ్చిస్తున్న రూ.394 కోట్లకు తోడు మరో రూ.40కోట్ల భారం పడనుందని అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ప‌థ‌కాలు అమ‌లు అయితే మ‌హానేత ఆశ‌యం నెర‌వేరిన‌ట్లు అవుతోంది. అంతా మ‌హానేత చ‌లువ అని ప‌లువురు రాజ‌కీయ నేత‌లు పేర్కొంటున్నారు.