జనం కోసం దేనికయినా సిద్ధం అంటున్న జగన్..

747
SHARE

గడచిన ఎన్నికల్లో ఓటమిపాలైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఏమాత్రం హుషారు తగ్గలేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రతో తెలుగు నేలను చుట్టేసిన ఆయన… ఎన్నికల తర్వాత తన పర్యటనలను కాస్తంత కుదించుకున్నట్లుగానే కనిపించారు. అయితే మరె రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఆయనలో మూడేళ్ల ముందు నాటి ఉత్సాహం ఉరకలెత్తుతోందనే చెప్పాలి. మొన్నటివరకు యువ భేరీలంటూ అడపాదడపా జిల్లా కేంద్రాలకు వెళ్లిన ఆయన కళాశాల విద్యార్థుల్లో మాటా మంతీ కలిపారు. ఈ క్రమంలో మొన్న విజయనగరంలో నిర్వహించిన యువభేరీలో ఓ విద్యార్థి అధికార టీడీపీని – సీఎం చంద్రబాబునాయుడిని దునుమాడుతూ… ఫక్తు రాజకీయ నేతకు మల్లే సంధించిన ప్రశ్నలు జగన్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లుగా ఉంది.

విజయనగరం యువభేరీ తర్వాత యువభేరీలను వదిలేసిన జగన్… కొత్తగా రైతు భరోసా యాత్ర పేరిట మళ్లీ తన పర్యటనలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన జగన్… గడచిన ఎన్నికల్లో తన పార్టీకి అత్యధిక స్థానాలను అందించిన కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ దూకుడు చూస్తే… ఆయనలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతోందని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వేల్పనూరు – అబ్దుల్లాపురం గ్రామాల్లో జగన్ పర్యటించారు. అబ్దుల్లాపురం పర్యటనలో భాగంగా ఆయన పొలాల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు – రైతు కూలీలతో మాట్లాడేందుకు వెళ్లారు.

తమ కోసం వస్తున్న జగన్ ను చూసి అక్కడి రైతు కూలీలు పనులు పక్కనపెట్టేసి ఆయనతో చేయి కలిపేందుకు ఉత్సాహం చూపారు. ఈ క్రమంలో పొలం గట్లను దాటుకుంటూ వస్తున్న వారిని చూసిన జగన్… మీరు రావద్దు – నేనే మీ వద్దకు వస్తానని చెబుతూ కారు దిగేసి… పొలం గట్ల బాట పట్టారు. ఈ సందర్భంగా ఎదురైన ఓ పిల్ల కాలువను ఆయన అమాంతం ఎగిరి దూకేసి కూలీల వద్దకు వెళ్లారు. ఈ దృశ్యాన్ని ఆయన సొంత పత్రిక సాక్షి కెమెరామెన్లు తమ కెమెరాల్లో బంధించేశారు. ఈ ఫొటోలను ఆ పత్రిక నేటి తన సంచికలో ప్రధానంగా ప్రచురించింది. ఈ ఫొటోను చూస్తుంటే… ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ మరింత ఉత్సాహంగా కనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్న వాదన వినిపిస్తోంది.