జగన్ మాటలు అక్షర సత్యాలు..

482
SHARE

నిజానిజాల్ని పక్కన పెడితే.. కొంతమందికి కొన్ని పేర్లు అట్టే వచ్చేస్తుంటాయి. కొందరు ప్రముఖుల్ని తలచుకున్న వెంటనే వారికి సంబంధించిన అంశాలు కొన్ని అంశాలు చప్పున గుర్తుకు వచ్చేస్తుంటాయి. వాస్తవానికి అందులో నిజం పాళ్లు పెద్దగా ఉండకపోవచ్చు కూడా. ఎవరి వరకో ఎందుకు జగన్ పేరు తలుచుకున్న వెంటనే లక్ష కోట్ల ఆస్తిపరుడన్న మాట చప్పున గుర్తుకు వస్తుంది. నిజంగా లక్ష కోట్లను జగన్ వెనకేశారా? అంటే లేదనే చెబుతారు.

జగన్ ఆస్తుల మీద భారీగా ఆరోపణలు చేసే వారిని సైతం.. లక్ష కోట్ల లెక్కను చెప్పమంటే.. చెప్పలేక నీళ్లు నమిలే పరిస్థితి. లక్ష కోట్ల మాట మాదిరే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు చెప్పినంతనే రైతుల నోట కరవు మాట వినిపిస్తుంది. అదే సమయంలో దివంగత మహానేత వైఎస్ గురించి ప్రస్తావించిన వెంటనే ఆయన హయాంలో వర్షాలు బ్రహ్మాండంగా కురిశాయన్న మాట చెప్పేస్తుంటారు.

నిజానికి కరవు.. వర్షాలు పడటం లాంటివి పాలకుల చేతుల్లో ఉండవు. కానీ.. అధికారంలో ఉన్న వ్యక్తికి తగ్గట్లు వాతావరణం మారిపోతుందనే నమ్మకాలకు తగ్గట్లుగా రాజకీయ విమర్శలు ఉండటం మామూలే. చంద్రబాబును మిగిలిన విషయాల్లో డిఫెన్స్ లో పడేయటం కంటే కూడా.. బాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే కరవు వచ్చేస్తుంది.. వర్షాలు అన్నవే అస్సలు పడవన్న ఒక అపప్రద ఉంది.

అందులో నిజం మాటను పక్కన పెడితే.. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసినప్పుడు.. ఆయన గద్దె దిగే సమయంలో తీవ్ర కరవుతో రాష్ట్రం ఇబ్బంది పడటాన్ని మర్చిపోలేరు. అందుకేనేమో.. రైతుల మనసుల్లో నాటుకు పోయేలా.. బాబు అంటే భయం కలిగే మాటల్ని ఈ మధ్యన ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ నోటి నుంచి వస్తోంది. తాజాగా ఆయన రైతు భరోసా యాత్రను చేస్తున్నారు. కర్నూలు జిల్లాల్లో ప్రస్తుతం పర్యటిస్తున్న ఆయన.. తాజాగా బాబుపై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తూ.. ఆయనంటే రైతుల్లో భయం కలిగేలా కొన్ని వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

‘‘చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత రాష్ట్రానికి తెచ్చింది వరుసగా కరువే.. కరువు. ఒకవైపు రైతులు పంటలు పండక.. పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు బాధలు పడుతున్నారు. చంద్రబాబు పుణ్యమా అని రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆయన మాత్రం రైతులను చూసి వెటకారం చేస్తున్నారు. వృద్ధి రేటులో దేశం కన్నా ఎక్కువ పరిగెత్తుతున్నామని ఉపన్యాసాలిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో రైతుల మీద వరాల వర్షం కురిపించిన చంద్రబాబు.. అబద్ధపు హామీల్ని చెప్పి ప్రజల్ని పక్కదారి పట్టించారని జగన్ మండిపడుతున్నారు. రైతులతో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తూ.. వారి ఇబ్బందుల్ని తెలుసుకుంటూ.. పాలక పక్షంపై విమర్శల జోరు పెంచిన జగన్.. పనిలో పనిగా రైతుల మనసుల్లో బాబు పాలన అంటే భయం కలిగించేలా మాటల విత్తనాల్ని నాటుతున్నారనే చెప్పాలి. ఒకవేళ రానున్న రెండేళ్లలో సైతం వర్షాలు అంతంత మాత్రం కురిస్తే మాత్రం.. జగన్ మాటలు అక్షర సత్యాలుగా మారటమే కాదు.. బాబు ఇమేజ్ తీవ్రంగా డ్యామేజ్ కావటం ఖాయమని చెప్పక తప్పదు.