పలుచబడుతున్న పచ్చ పార్టీ

968
SHARE

పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు దేశం పార్టీ నేతలు అంతర్గత కుమ్ములాటలతో రోడ్డెక్కారు. పదిహేను మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యురాలు అధికార పార్టీకి చెందిన వారే. అయినా పార్టీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తి రాజ్యమేలుతున్నాయి. పార్టీని అంటిపెట్టుకుని పెత్తనం చెలాయించే వారు కొందరైతే అసలు పార్టీ పదవులను కూడా భర్తీ చేయని వారు మరికొందరు. ఇదేసమయంలో మిత్రపక్షమైన బీజేపీ గెలుపొందిన ఒక్కసీటులో పరిస్థితి నిప్పు, ఉప్పులా తయారైంది. ఒకప్పుడు మంత్రివర్యుల పేరు చెబితే కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకూ అంతా ఆ మాటకు విలువనిచ్చేవారు.

మంత్రి పీతల సుజాత నియోజకవర్గం చింతలపూడినే తీసుకుంటే ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే భేద భావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన జిల్లా సమన్వయకమిటీలో మంత్రి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాల్గొంటున్నారని మంత్రి సుజాత కన్నీళ్లు పెట్టుకుంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సమన్వయ కమిటీలు ఉండగా చింతలపూడి నియోజకవర్గానికి మాత్రం ఇప్పటివరకూ సమన్వయ కమిటీ లేదు. వివిధ మండలాల్లో ఉన్న సమస్యలు సమన్వయ కమిటీ ద్వారా పరిష్కారమైతే ప్రధానమైన వాటిని ఎమ్మెల్యేగాని, మంత్రిగాని పరిష్కరించడానికి వీలుంటుంది. కానీ ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ కమిటీ ఊసేలేదు.

పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న సీనియర్‌ నాయకులు కూడా ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అదేమని అడిగితే నిన్నకాక మొన్న వచ్చిన నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యం మాకు లేనప్పుడు మేం ఎందుకు రావాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాడేపల్లిగూడెం నిఝెజకవర్గానికి మాణిక్యాలరావు నేతృత్వం వహిస్తుండగా ఈయన రాష్ట్రమంత్రి మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో మాత్రం మిత్రపక్షంతో సమన్వయం అంతగా లేదు. జిల్లాలో ఆచంట నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగాఉంది. ఈ నియోజకవర్గానికి పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా నేతృత్వం వహిస్తున్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలుగాని, ఇతర అభివృద్ధి అంశాల్లో చురుగ్గా పాల్గొనే ఈ నేత జిల్లా స్థాయి సమీక్షలు, ఇతర కార్యక్రమాల్లో అంతగా హాజరుకావడం లేదు. సమన్వయ కమిటీ సమావేశానికి కూడా ఈయన రావడం లేదు. ఇక్కడ కూడా గతం నుంచీ పార్టీలోనే ఉంటున్న సీనియర్‌ నాయకులతో నియోజకవర్గస్థాయి నేతలకు అంతగా సఖ్యతలేదు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. గతంలో పని చేస్తే పర్సంటేజీలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు పని మొత్తం తమ బినాలతోనే చేయిస్తూ తెరవెనుక గుత్తేదారుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నీరు–చెట్టు కార్యక్రమం చేపడితే ఈ పనులు మొత్తం చేసిన వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేనని తెలుస్తోంది.

ఇటు జిల్లాకేంద్ర పరిసర ప్రాంత నియోజకవర్గాల నుంచి మొదలుపెట్టి అన్నిచోట్ల ఉన్న నేతలంతా ఇదేతరహా పనులు చేయడానికి చూస్తున్నారు. జిల్లాకేంద్ర సమీపంలోని ఒక ఎమ్మెల్యే పంచాయతీలను కొన్ని తాను చూసి మరికొన్ని మరొక ఎమ్మెల్యేకు బదలాయిస్తున్నారు. దీంతో పంచాయతీకి వెళ్లే వారు తాము ఇద్దరికీ నజరానాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు ఇసుక ఉచితాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇసుకను రాసులుగా పోసి వీటిని వేర్వేరు నిర్మాణాల కోసమని అనుమతులు తీసుకుని వాటిని బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఈవిషయం అధికారులకు తెలిసినా పట్టిపట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల అక్రమాలు జాబితా చాంతాడులా ఉంటుంది. ఇదేపరిస్థితి మరికొన్నాళ్లు సాగితే ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల గౌరవం తగ్గుతోంది. ఈ పరిణామాలతో ఇక అధికార పార్టీలో ఉండలేమని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఓ నిర్ణయానికి వచ్చారు. వీరంతా కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.