వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం..

928
SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ఎక్కడ అపార్ట్‌మెంట్‌ కనబడితే అక్కడ పాఠశాలలు నడిపిస్తున్న ఘటనలు రానివ్వబోమన్నారు. ఫీజల కోసం వేధించుకు తింటున్న వ్యవస్థను రూపుమాపుతామన్నారు. మారిన విద్యావ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను కూడా మార్చుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసేసి ఉపాధ్యాయులను కూడా ఇంటికి సాగనంపే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు.

ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాన్ని, విద్యార్థి సంఘాలను అణచివేసేందుకు తప్ప పోలీసు యంత్రాంగం దేనికీ పనికిరావడం లేదని ఆరోపించారు. ఏ దేశం వెళ్లొచ్చి ఆ దేశంలా రాష్ట్రాన్ని మారుస్తామంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు మీరేం మార్చాల్సిన పనిలేదు.. మన రాష్ట్రాన్ని ఆంధ్రాలాగే ఉంచితే చాలని కోరారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశాల పేరుతో చంద్రబాబు సింగపూర్‌ వెళ్లి ఇక్కడ దోచుకున్న నల్లధనం సరిగ్గా ఉందో లేదో చూసుకుని వస్తారని ఎద్దేవా చేశారు.