బీజేపీలో ప్రాధాన్యత కరువు సొంత గూటికి రఘురామకృష్ణంరాజు

7142
SHARE

బీజేపీ నేత, పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు (రఘురాజు) తిరిగి తన సొంతగూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో 2014లో రఘురాజు కు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సీటు దాదాపుగా ఖరారరైంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆవెంటనే బీజేపీలో చేరారు. అక్కడకూడా తనకు ఎదురులేదని చెప్పుకున్నరఘురాజుకు కనీసం సీటు కూడా ఇవ్వలేదు. అప్పుడే ఆయన వైసీపీని వీడి బీజేపీలో చేరి తప్పు చేశాననే భావనకు లోనయ్యారు. నరసాపురం వైసీపీ ఎంపీగా రఘురాజు వంటి బలమైననేత ఉంటే టీడీపీ, బీజేపీలకు గట్టి పోటీ వస్తోందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు పలువురితో లోపారుకారీ ఒప్పందం చేసుకుని రఘురాజును ఎన్నికలకు కొద్దినెలల ముందే బీజేపీలో చేర్చుకున్నారని తెలుస్తోంది. అనంతరం సీటు ఇవ్వకపోగా కనీసం బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు కానీ ఇతర బీజేపీ నేతలు కానీ ఆయనకు ఎటువంటి పదవినీ ఇవ్వలేదు. పైగా తెలుగుదేశం పార్టీకి పశ్చిమనుంచి రఘురాజు ఎంతో సాయం చేశారు.

జిల్లావ్యాప్తంగా పలువురు నేతలను చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి టీడీపీలో చేర్పించారు. ఇలా నడుస్తుండగానే బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు ఎట్టకేలకు కుదిరడంతో అనుకున్నట్లుగానే చంద్రబాబు నరసాపురం సీటును బీజేపీకి వదిలేశారు. కానీ అక్కడ రఘురాజు అభ్యర్థిత్వానికి మాత్రం కనీసం భరోసా ఇవ్వలేదు. దీంతో రఘురాజు పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబుపైనే ఆయన పూర్తిగా ఆధారపడినట్లు ప్రచారం జరుగింది. ఈ తతంగమంతా ముగిసిన అనంతరం రఘురాజు రాజకీయాల్లో స్తబ్ధుగా ఉండిపోయారు. బీజేపీలోనూ ఆయనకు సముచిత స్థానం లభించట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు, ఫాలోయింగ్ ఉన్న ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని చూస్తున్నారట. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీల జోలికి వెళ్లకుండా తన సొంతగూటికి వెళ్లడమే మేలని భావిస్తున్నట్టు సమాచారం. పైగా ఆయన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు కూడా రఘురాజును వైసీపీ చేరాలని కోరటంతో ఆదిశగా వైసీపీనేతలతో రఘురాజు మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొద్దిరోజులల్లో ఆయన వైసీపీలో చేరి క్రియాశీలకంగా పనిచేయనున్నారని తెలుస్తోంది. రఘురాజువంటి కీలకనేత తిరిగి పార్టీలోకి వస్తే వైసీపీ జెండా పశ్చిమలో రెపరెపలాడడం ఖాయంగా కనిపిస్తోంది.