జగన్‌ పోరాటాలకు ఆకర్శితులవుతున్న నాయకులూ.. 29న వైయస్‌ జగన్‌ సమక్షంలో కోటగిరి శ్రీధర్‌ చేరిక…

964
SHARE

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రోజు రోజుకు బలోపేతమవుతోంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. ప్రజల వెంట నడుస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజాదరణ పెరుగుతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న అలుపెరగని పోరాటాలకు ఆయా పార్టీలకు చెందిన నేతలు ఆకర్శితులవుతున్నారు. ఇటీవల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. గత నెలలో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఆ తరువాత రోజు బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మరో రెండు రోజులకు మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.

కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో పలు టీడీపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నాయకత్వంలో వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆ తరువాత కూడా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పలువురు నాయకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 24న చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, డీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయభాస్కర్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఆయన వెంట పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌ విండో డైరెక్టర్లు వైయస్‌ఆర్‌సీపీలో చేరగా, వారికి పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కండువాలు వేసి సాదారంగా ఆహ్వానించారు. తాజాగా మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్‌బాబు, టీడీపీ మాజీ నేత బలరాం సహా పలువురు నేతలు ఈ నెల 29న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పార్టీలో చేరబోతున్నారు.