ఎన్ని కోట్లిస్తే ఈ అభిమానం వస్తుంది.?

1016
SHARE

రాష్ట్రంలో ఎక్కడ ఏ వర్గానికి చిన్న సమస్య వచ్చినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాలిపోతున్నారని శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి అన్నారు. అటువంటి నాయకత్వాన్ని, అభిమానాన్ని వదిలి కొంత మంది స్వార్థపరులు టీడీపీకి అమ్ముడపోయారని ఆయన మండిపడ్డారు. నాడు వైయస్‌ జగన్‌ పేరు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు టీడీపీలో చేరిపోయారని, ఎన్ని కోట్లు ఇస్తే ఈ అభిమానం వస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రేమాభిమానాన్ని ఎన్ని కోట్లతో కొనుగోలు చేయగలరని టీడీపీని ప్రశ్నించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుడ్డా మాట్లాడారు.

తాను లోకల్‌ కబాలి కాదని, ఎవరికి దండాలు పెట్టే రకం కాదని, జగన్‌ అండ ఉన్నంత వరకు తనను ఎవరు ఏం చేయలేరని, తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. దేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా రైతు భరోసా యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి అన్నారు. పార్టీలు మారే స్వార్థపరులను తరిమితరిమి కొడదామన్నారు. బుడ్డా రాజశేఖరరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో గెలిచి,ఎవరిని పట్టించుకోకుండా, చివరకు కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా టీడీపీలో చేరిపోయారని మండిపడ్డారు. సాగునీటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని,తాగునీటికి కటకట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్నడు జిల్లాలో రైతు ఆత్మహత్యలు లేవని, గత రెండేళ్లుగా ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పుటికీ ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన గొప్ప వ్యక్తి వైయస్‌ జగన్‌ అని కొనియాడారు.