కాంగ్రెస్ లో నుండి వైస్సార్సీపీలో కి కొనసాగుతున్న వలసలు..

2944
SHARE

చేరికలు ఆగవు.. అని స్పష్టం చేశాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్ష పదవుల్లో ఉండిన కొందరు సమర్థులను జగన్ తన పార్టీలోకి చేర్చుకుంటున్నాడు. ఇటీవల జరిగిన వివిధ చేరికలను బట్టి చూస్తే.. కాంగ్రెస్ లో మిగిలిన కడు సమర్థులను నాలుగు ఓట్లు వేయించగల వ్యక్తులను చేర్చుకుంటున్నాడని స్పష్టం అవుతోంది. రాజకీయ నేఫథ్యాన్ని కూడా పరిశీలించి జగన్ కండువాలు కప్పుతున్నాడని స్పష్టం అవుతోంది.

మరి ఈ పరిణామాల మధ్య ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో మిగిలిన కొంతమంది నేతలు.. ఈ ఊపులో వైకాపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ జాబితాలో రఘువీరారెడ్డి, కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి వంటి వాళ్లు కూడా ఉన్నారా? అనేది ఆసక్తికరమైన అంశం.

పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రఘువీర ఈ మధ్య పెద్దగా హడావుడి చేయకపోవడాన్ని గమనించవచ్చు. నోట్ల రద్దు వ్యవహారం గురించి, ఇతర వ్యవహారాల గురించి కేంద్రాన్ని విమర్శిస్తున్నాడు కానీ, ఒక దారీ తెన్ను లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏం చేసినా ప్రయోజనం అయితే లేదు. ఇదే సమయంలో అనంత రాజకీయాలను గమనిస్తే.. జగన్ కు – జేసీలకు దూరం పెరిగింది. జేసీల గొంతెమ్మ కోరికలను తీర్చలేనని జగన్ స్పష్టం చేయడంతో ఇక జేసీ సోదరులు వైకాపాలో చేరడం జరిగే పనిలా కనిపించడం లేదు.

ఇది రఘువీరారెడ్డికి ఒకింత అనుకూల పరిణామమే. అనంత వైకాపాలో ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితం అయిన వారే తప్ప.. జిల్లా నేతలుగా నేము, ఫేమూ ఉన్న వారు కనిపించడం లేదు. కల్యాణదుర్గం వంటి నియోజకవర్గాన్ని టార్గెట్ లో పెట్టుకుని రఘువీరారెడ్డి వైకాపాలో చేరితే.. పార్టీలో, రాజకీయాల్లో ఆయన రాణింపుకు మంచి అవకాశమే అవుతుంది. దాదాపుగా ఇదే జరగవచ్చు కూడా. ఇక చేరికలు కొనసాగుతాయని జగన్ కూడా ఆహ్వానాల ధోరణినే కనబరిచాడు. ఇలాంటి నేపథ్యంలో వైకాపాలో చేరతాడనే అంచనాలున్న కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకుంటాడేమో!