చంద్రబాబు జనం మధ్యకు వస్తే రాళ్లతో కొడతారు: జగన్

277
SHARE

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలులో పర్యటించిన జగన్ బాబుపాలనపై నిప్పులు చెరిగారు. అద్దాల మేడలో నుంచి బయటకు వస్తే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కొనుగోలు చేస్తే బాబు గెలవలేరని విమర్శించారు. ఎంత మందిని కొన్నాం, ఎంత సంపాదించామన్నదే చంద్రబాబుకు కావాలని, ఎంతకాలం బతికామన్నది కాదు కావాల్సింది, ఎలా బతికామన్నది ముఖ్యమని, ఆ విషయాన్ని బాబు గుర్తుంచుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు జ్ఞానోదయం కావడం కోసం మనమంతా ఒక్కటి కావాలని, మీ అందరి దీవెనలు తనకు కావాలని జగన్ కోరారు.

కేబినెట్ లో రైతు రుణమాఫీపై చర్చించడం లేదని, రైతుల భూములను లాక్కొని అమ్ముకోవాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో నలభై ఐదు మంది రైతులు చనిపోయినట్లు చెబుతున్నారు కానీ, నలుగురికే ఎక్స్ గ్రేషియా చెల్లించారని ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తానన్న బాబు మాటలు నమ్మిన రైతులు, ఈరోజు అప్పుల పాలై రోడ్డున పడ్డారని జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలకు చంద్రబాబు గండి కొట్టారని జగన్ మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. వైఎస్సార్ నిర్మించిన ప్రాజెక్టులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తున్నారని మండిపడ్డారు.