రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన

1000
SHARE

రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన జరుగుతోందని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి దుర్మార్గ పాలనను చూడలేదని వైయస్‌ఆర్‌ సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కారంపూడిలో మండల మైనార్టీ నాయకుడు షేక్‌ ఇమామ్‌సాహెబ్‌ నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వార్డు మెంబర్లుగా కూడా గెలవని వారిని పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా నియమించుకుని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట పక్కాగా ప్రోటోకాల్‌ను ఉల్లంఘింస్తూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గ్రాంటులను కూడా ఇవ్వకుండా వారిని అవమానిస్తున్నారని మండి పడ్డారు. దీనిపై సాక్షాత్తు సీఎంకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేని పరిస్ధితి దాపురించిందని ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు శ్రీకారం చుట్టిన ఘనత టీడీపీకే చెల్లుతుందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పార్టీలకతీతంగా పేదలందరికి సంక్షేమఫలాలు అందించి అందరి నోట నుండి దేవుడుగా కీర్తించబడితే, పింఛన్ల దగ్గర నుండి అన్ని సంక్షేమ పధకాలు ఇవ్వడానికి ఒక్కోదానికి ఒక్కో రేటు నిర్ణయించి దోపిడీకి పాల్పడుతున్న బాబు పాలన తీరు జుగుస్సాకరంగా వుందని విమర్శించారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌లను పార్టీ కార్యక్రమాలకు పరిమితం చేయకుండా ఎమ్మెల్యేలు చేసే పనులను వారిచే చేయిస్తూ రాజ్యాంగ విరుద్ధ పాలన సాగిస్తున్నారని, ప్రక్క రాష్ట్రం తెలంగాణాను చూసైనా ఇక్కడ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సంప్రదాయం ప్రకారం నియోజకవర్గ ఫంఢ్స్‌ అందిస్తున్నారన్నారు. ఇలా ప్రతిపక్షాన్ని అణచి వేసే ప్రతి చర్యకు భవిష్యత్తులో వంత పాడుతున్న అందరూ సమాధానం చెప్పాల్సి వుంటుందని హెచ్చరించారు.