శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ఉగ్రవాదులు అంటున్నారు

437
SHARE

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ విశాఖపట్టణం ఆర్‌కే బీచ్‌లో మౌనంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించాలను కోవడం ఉగ్రవాదమా? అరాచకమా? తగుల బెట్టడమా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. విశాఖలో ప్రశాంతంగా జరగాల్సిన నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వమే పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పి ఏ విధంగా అణచి వేసిందో ప్రజలంతా చూశారన్నారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడారు. విశాఖలో అణచి వేత కార్యక్రమాలకు దిగింది చాలక చంద్రబాబు గురువారం రాత్రి దారుణమైన వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. అసలు విశాఖను తగుల బెట్టడానికి ఎవరు వచ్చారని ప్రశ్నించారు.

కళ్లార్పకుండా బాబు అబద్ధాలు..
‘ఎన్ని ఘోరాలు ఆపాల్సి వచ్చింది, వాటన్నింటికీ ఒక వ్యక్తి కారణం, అతడి కుటుంబ నేపథ్యం… అంటూ కళ్లార్పకుండా వందల కొద్దీ అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. దేశంలో భారీ ఓట్లు వచ్చి ప్రతిపక్షంలోకి వచ్చిన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్సేనని, అంతటి ప్రజా మద్దతు గలిగిన ప్రతిపక్ష నాయకుడు విశాఖకు వస్తే రన్‌వే మీదనే ఆపడంలో ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అక్కడ మోహరించిన పోలీసులు యూనిఫాంలు ధరించకుండా, ఐడీ కార్డులు చూపించకుండా మఫ్టీలో వచ్చామనడంలో అర్థం ఏమిటో చెప్పాలన్నారు. విచ్ఛిన్నకర శక్తులు, టెర్రరిస్టులు ‘వైజాగ్‌ను తగుల బెట్టడానికి వస్తూంటే ఆపొద్దా’’ అని చంద్రబాబు అన్నారని, అలాంటి క్రూరమైన మాటలను అంత ప్రశాంతంగా ఎలా అనగలిగారని సజ్జల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై పోలీసు కమిషనర్‌ కూడా క్షమాపణలు చెప్పారన్నారు. విశాఖకు అదే విమానంలో వచ్చిన ఇతర ప్రయాణీకులందరినీ బయటకు వెళ్లనిచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలను మాత్రమే ఆపడాన్ని అందరూ చూశారన్నారు.

చంద్రబాబు రెండేళ్లే అధికారంలో ఉంటారని, ఆ తరువాత తమ ప్రభుత్వం వచ్చాక ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లినపుడు పోలీసు అధికారులను బెదిరించలేదా అన్నారు. రెండున్నరేళ్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 32 సార్లకు పైగా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసిందన్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని పోలీసులు కూడా హోదాను కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను నిర్లక్ష్యం చేయడానికి ప్రధాన కారణం ఆయనకున్న బలహీనతలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టుకోవడ మేనన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే ఫ్యాక్షన్‌ ముద్ర
వైఎస్‌ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని చంద్రబాబు అంటున్నారని, ఏం చరిత్ర ఉందని వైఎస్‌ రాజశేఖరరెడ్డిని రెండుసార్లు రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని సజ్జల ప్రశ్నించారు. వైఎస్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్యాక్షన్‌ ముద్ర వేయడం వాస్తవం కాదా? అని నిలదీశారు. వైఎస్‌ హయాంలోనే విశాఖకు సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ వచ్చిందని, ఆ తరువాత టూ టైర్‌ సిటీ అభివృద్ధి కోసం నిధులు వచ్చాయన్నారు. వైఎస్‌ హయాంలోనే విశాఖ నగర ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. విజయమ్మ ఓటమిపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. వాల్తేరు క్లబ్బులో ఏం జరిగిం దో అందరికీ తెలుసునని, ఆ కుట్ర వ్యవహారాలు తరువాత వెలుగులోకి వచ్చాయన్నారు.
గత ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఏమీ కాదని, ఈసారి తాము అక్కడ గెలుస్తామని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను పులివెందుల వాసినేనని, అక్కడ ఫ్యాక్షన్‌ రాజకీయాలను రూపుమాపేందుకే వైఎస్‌ ప్రయత్నించారన్నారు. వైఎస్‌ తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితునికి చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో రక్షణ కల్పించారని, ఆ నిందితునికి మార్కెటింగ్‌ కమిటీ ౖచైర్మన్‌ పదవి కూడా ఇచ్చారన్నారు. తన తండ్రిని హత్య చేసినా ప్రతీకారం తీర్చుకోవడానికి వైఎస్‌ ప్రయత్నించలేదన్నారు. వైఎస్‌ మరణించిన తీరుపై అనుమానాలున్నా ఏనాడూ వైఎస్‌ కుటుంబందాని గురించి మాట్లాడలేదన్నారు.